DGP Mahender Reddy News : లక్ష మందికిపైగా ఉన్న తెలంగాణ పోలీస్‌శాఖలో ప్రతి పోలీస్ పదవీవిరమణ పొందేనాటికి సొంత ఇంటిని కలిగిఉండే లక్ష్యంతో ప్రణాళిక అమలు చేస్తున్నట్లు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఆరోగ్యభద్రత మాదిరిగా ఇంటి నిర్మాణానికి నామమాత్రపు వడ్డీతో ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమాలపై కమిషనర్లు, ఎస్పీలతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ అధికారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన సంక్షేమ సంఘానికి ఆదాయ పన్ను మినహాయింపు లభించేలా సహకరించారని చెప్పారు. ఈ సంఘం మూలధనాన్ని పెంచేందుకు పోలీస్‌శాఖకు చెందిన ఖాళీస్థలాల్లో పెట్రోల్ పంపులు, ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతించారని వెల్లడించారు. ఈ సంఘానికి స్వచ్ఛందంగా విరాళాలు అందించేవారికి 80జీ, 12ఏ కింద ఆదాయపన్ను మినహాయింపు లభిస్తోందన్నారు.
సీసీటీవీల నిర్వహణకు ప్రత్యేక విభాగం : రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటైన దాదాపు 9లక్షల సీసీటీవీల నిర్వహణకు ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ’ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో పెద్దఎత్తున సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నా నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీన్ని అధిగమించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ ఆర్థికసాయం : కొవిడ్ పోరులో మరణించిన పోలీస్ అమరుల కుటుంబాల్లోని విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ ఆర్థిక సహాయం అందించింది. సామాజిక బాధ్యత కార్యక్రమం ‘పరివర్తన్’లో భాగంగా ‘కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్‌షిప్’ పేరిట రూ.15వేల నుంచి రూ.75వేల చొప్పున 25 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలను అందించింది. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, డీజీ(సంక్షేమం) ఉమేశ్‌షరాఫ్, అదనపు డీజీ (శాంతిభద్రతలు) జితేందర్ సమక్షంలో బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ తరుణ్‌చౌదరి, సర్కిల్ హెడ్ బద్రివిశాల్, జోనల్ హెడ్ జోస్ స్టీఫెన్ చెక్కుల్ని అందించారు.
ఇదీ చూడండి: Gang Rape in Hyderabad: ఆటోలో ఎక్కించుకుని.. ఆపై ముగ్గురితో కలిసి దారుణం