ఏపీలోని కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి సెంటర్‌కు పలువురు వైకాపా కార్యకర్తలు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గందరగోళం మధ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేవినేని ఉమ బైఠాయించారు. ఈ క్రమంలో దేవినేని ఉమను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను గృహనిర్బంధం చేశారు.
అంతకుముందు దేవినేని ఇంటి వద్దకు రాకుండా తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని తెలిపారు. దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇంటికి వెళ్లే మార్గాల వద్ద బారికేడ్లు పెట్టి అనుమతించలేదు.
అసలు ఏమైందంటే?
నిన్న ఏపీ మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గురించి మాట్లాడితే తన చేతిలో దెబ్బలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష చేయాలనుకున్నారు. ఆపడానికి ఎవరు వచ్చినా తేల్చుకునేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష చేసేందుకు వెళ్లడంతో.. అదుపులోకి తీసుకున్నారు.