ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందన్నారు. ఆ దిశగా ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు దోహదపడే పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం బస్తీ దవాఖానాలు నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధించిందని, మిగతా పట్టణాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టిందని కేసీఆర్ అన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకు పాటు పడుతున్నాం
ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు పాటు పడుతున్నామని సీఎం తెలిపారు. ప్రొటీన్‌తో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ, ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం మాంసం, చేపల వినియోగాన్ని పెంచే పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే అమలు పరుస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్వచ్ఛ కార్యక్రమాలు.. పలు జాతీయ అవార్డులు పొందడం.. ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సునిశితంగా పనిచేస్తున్నదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఆరోగ్యం మెరుగుపడింది
గత ఏడాది కాలంగా కరోనా కష్టకాలాన్ని తెలంగాణ తట్టుకొని నిలబడడానికి ప్రజల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని, రోగ నిరోధక శక్తి స్థాయి పెరగడానికి ఇవి దోహద పడ్డాయని కేసీఆర్ అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న.. మిషన్ భగీరథ... శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం సరఫరా చేస్తుండటంతో ప్రజలను రోగాల నుంచి కాపాడుతూ ప్రజారోగ్యం గుణాత్మకంగా మెరుగు పడిందని పేర్కొన్నారు. తల్లీ, బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతమై, మాతా శిశు సంక్షేమం మెరుగుపడిందని తెలిపారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గిపోయి, బాల్య ప్రసవాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని కేసీఆర్ అన్నారు. కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పౌష్టికారం తీసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని కేసీఆర్ సూచించారు. నిరంతరం ఆరోగ్యంపై దృష్టి నిలపడం ద్వారా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా...