Dengue cases in telangana: దోమకాటు ప్రమాదకరంగా మారుతోంది. ఫలితంగా రాష్ట్రంలో డెంగీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చినుకుజాడతో దోమల బెడద, దాంతో పాటే డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా.. సుమారు 1200 డెంగీ కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ జనవరి నుంచే డెంగీ కేసులు నమోదవుతున్నా ఏప్రిల్‌లో ఏకంగా 100 మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. జూన్‌లో అత్యధికంగా 565 డెంగీ కేసులు నమోదైనట్లు... వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 222 మందికి డెంగీ సోకింది. ఏడు జిల్లలాలపై.. ప్రభావం అత్యధికంగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 516 మంది డెంగీ బారినపడ్డారు. రంగారెడ్డిలో 97, కరీంనగర్‌లో 82, ఆదిలాబాద్‌లో 57, మేడ్చల్‌లో 55, మహబూబ్ నగర్‌లో 54, పెద్దపల్లిలో 40 కేసులు నమోదయ్యాయి.
ప్రధానంగా పగటిపూట కుట్టే దోమలతోనే డెంగీ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. డెంగీ సోకిన వారిలో తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు, తలతిరగటం, వాంతులు, కంటి వెనక భాగంలో నొప్పి, ఒంటిపై దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మరికొందరిలో విపరీతమైన నీరసంవంటి లక్షణాలుకనిపిస్తాయి. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి తగు నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వానాకాలంలో ఇల్లు, ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంంగా ఉంచుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. డెంగీ సోకినవారిలో ప్లేట్‌లెట్ వంటి ఖరీదైన చికిత్సలను అవసరమైన వారికి మాత్రమే అందించాలని... అనవసరంగా చేస్తే ఆయా ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని.. వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.