జేఎన్‌టీయూలో కీలక పోస్టులో ఉన్న ఆచార్యుడికి గతేడాది వీసీల నియామకానికి దరఖాస్తులు స్వీకరించే నాటికి పదేళ్ల అనుభవం లేదు. ఆయనకు ఉన్న బోధన అనుభవం, పని తీరు దృష్ట్యా ఇంకో పదవి అప్పగించారు. ప్రస్తుతం వేరొక విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా నియమిస్తే మరింత సమర్థంగా పనిచేస్తానని చెబుతున్నారు.
విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకంలో నెలలుగా జరుగుతున్న జాప్యం కొందరు ఆచార్యులకు కలిసివస్తోంది. బోధన అనుభవం పరంగా అర్హత సాధించడంతో మరోసారి దరఖాస్తుకు అవకాశమివ్వాలని పలువురు ఆచార్యులు కోరుతున్నారు. గతేడాది జులైలో ఉస్మానియా, జేఎన్‌టీయూ, బీఆర్ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం పూర్తయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ పదవీ కాలం ముగిసింది. ఆయా వర్సిటీల వీసీల నియామకానికి గతేడాది జులైలో ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అప్పట్లో వివిధ వర్సిటీల ఆచార్యులు, పదవీ విరమణ చేసినవారు దరఖాస్తు చేసుకున్నారు.
పదేళ్ల సర్వీసు పూర్తి
ఎవరైనా ఆచార్యుడు ఉప కులపతి పదవికి దరఖాస్తు చేసుకోవాలంటే పదేళ్ల బోధన అనుభవం ఉండాలి. గతేడాది జులై నాటికి పదేళ్ల అనుభవమున్న ఆచార్యులు అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ 18 నెలల కాలంలో ఆయా వర్సిటీల్లో దాదాపు 35 మందికి పదేళ్ల సర్వీసు పూర్తయింది. ఉప కులపతిగా ఎంపికయ్యేందుకు అర్హత సాధించినా, ప్రభుత్వం నుంచి దరఖాస్తుల స్వీకరణ లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. వీసీ పదవికి అర్హుడైన ముగ్గురు లేదా ఐదుగురిని ఎంపిక చేయాల్సిన సెర్చ్ కమిటీ ఇటీవలే జరిగింది. ఈ క్రమంలో అర్హత సాధించిన వారందరినీ పరిగణలోకి తీసుకోవాలని ఆచార్యులు కోరుతున్నారు. త్వరగా వీసీల నియామకం చేపట్టాలని ఆచార్యులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : మూడు నెలల ముందే... ఓరుగల్లులో ఎన్నికల వేడి