వైరస్ వ్యాప్తి, వ్యాధి ప్రభావం ‘డిజిటల్, మాలిక్యులర్ సర్వేలెన్స్’తో ఆధారం దొరుకుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ (ఐజీఐబీ)తో పాటు మరికొన్ని సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఐజీఐబీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అన్ని ప్రయోగశాలలు, పరిశోధన సంస్థలు, ఆసుపత్రులు కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్లౌడ్ రూపంలో ప్రత్యేక కేంద్రానికి అందజేస్తాయి. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ‘ఆరోగ్యసేతు’ యాప్‌తో అనుసంధానించే అవకాశం ఉంది.
మూడు స్థాయిల్లో సమాచార సేకరణ..
వైరస్, రోగి, చికిత్స విధానాలు.. ఈ మూడింటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సమాచారం పంచుకునేందుకు ఆయా సంస్థలు డిజిటల్ బాటను అనుసరిస్తున్నాయి. ఇందులో సీసీఎంబీ ముఖ్యపాత్ర పోషిస్తోంది. వైరస్ జన్యు పరిణామక్రమాన్ని సంస్థ విశ్లేషిస్తోంది. నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ఈ సమాచారాన్ని ఐజీఐబీలోని కేంద్రంతో పంచుకోంటోంది.
సమగ్ర అధ్యయనం ద్వారా..
దేశవ్యాప్తంగా రోగుల చికిత్స సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) నుంచి సేకరిస్తున్నారు. వైరస్ సోకి బయట ఉన్నవారి డేటానూ పొందుపరుస్తున్నారు. సమగ్ర అధ్యయనం ద్వారా కరోనా తీరుతెన్నులు తెలియడమే కాదు నివారణ చర్యలకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
‘మా ప్రయోగశాలలో నెల రోజులుగా నిర్ధారణ పరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ, వైరస్ కల్చర్ చేస్తున్నాం. రోగి నమూనాల నుంచి వైరస్‌ను వేరు చేసేటప్పుడు గుర్తించిన విషయాలు, వైరస్ జన్యుక్రమ విశ్లేషణలో వెల్లడైన ఫలితాలతో చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. డిజిటల్ డేటా తయారు చేస్తున్నాం. ఈ సమాచారంతో ఏ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ఉంది? ఎవరికి వస్తోంది?.. కరోనా చికిత్స, టీకాలకు సంబంధించి పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఈ డేటాను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలతో పంచుకుంటున్నాం’ - డాక్టర్ రాకేశ్ మిశ్రా , సీసీఎంబీ డైరెక్టర్
ఎక్కడ ఎక్కువ..? నియంత్రణ ఎలా..?
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి..? వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి..? అనే అంశాలపై కొవిడ్ మ్యాపింగ్‌లో భాగంగా రోజువారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 709 పోలీస్‌స్టేషన్లుండగా హైదరాబాద్ కమిషనరేట్‌తో పాటు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కేసుల నమోదు అధికంగా నమోదవుతున్నాయి. ఆయా జిల్లాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోని కంటెయిన్‌మెంట్ జోన్లలో పరిస్థితి రోజురోజుకీ ఎలా మారుతోందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పాజిటివ్ కేసుల నమోదుకు గల కారణాల్ని విశ్లేషిస్తున్నారు. అక్కడ కొత్త కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికల్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇవీ చదవండి: హైదరాబాద్‌కు కేంద్ర బృందం- కరోనాపై క్షేత్రస్థాయి పరిశీలన