అక్టోబర్ 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఏర్పాట్లపై దేవస్థానం పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై అధికారులు, వైదిక కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం, మాస్కులు ధరించటంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.
దేవస్థానంలో నిర్వహించే ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, చండీయాగం వంటి పూజలకు ప్రత్యక్ష విధానం అమలు చేయడం సాధ్యమవుతుందా అని చర్చించారు. గతంలో లాగా బ్యాచ్‌కు రెండు వందల మంది కాకుండా అందులో సగానికి కుదించటం, పరోక్ష పూజా విధానాన్ని ప్రోత్సహించే విషయాలపై వైదిక కమిటీ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. క్యూలైన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 17న స్వర్ణకవచాలంకృత దుర్గదేవిగా, 18న బాలాత్రిపురసుందరీదేవి, 19న గాయత్రీ దేవి, 20 అన్నపూర్ణాదేవి, 21న సరస్వతీ దేవి, 22న లలితాత్రిపుర సుందరీదేవి, 23న మహాలక్ష్మీదేవి, 24న దుర్గాదేవి, మహిషాసురమర్దినీ దేవి, 25న రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించాలని నిర్ణయించారు. 24న తిథి అనుసారం రెండు అలంకారాలు చేస్తున్నట్లు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.
- ఇవీ చూడండి : భాగ్యనగరంలో తొలి లైవ్ ఫిష్‌మార్ట్