ఈనెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే.. శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు సహా..... వివిధ శాఖల అధికారులు ప్రస్తుతం సాగుతున్న ఏర్పాట్లను.. మంత్రికి వివరించారు. మొత్తం 10 రోజులు ఉత్సవాలు జరగనుండగా.. మూలానక్షత్రం రోజైన అక్టోబరు 5న ముఖ్యమంత్రి జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఈనెల 29న అమ్మవారికి స్నపనాభిషేకం తర్వాత ఉదయం 9గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాల సమయంలో రోజూ అమ్మవారికి సాయంత్రం 6గంటలకు నగరోత్సవం నిర్వహిస్తారు. విజయదశమి అయిన అక్టోబర్ 8న సాయంత్రం 5 నుంచి.. కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగనుంది. నవరాత్రులకు హాజరయ్యే భక్తుల కోసం.. పద్మావతి ఘాట్ సమీపంలో కేశఖండనశాల ఏర్పాటు చేయనున్నారు. నవరాత్రులు జరిగినన్ని రోజులు 24 గంటలూ పనిచేసేలా...కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. స్నానఘట్టాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగుకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు.
ఇదీ చూడండి : 'కరవు' కారణంగా అక్కడ గణేశ్ నిమజ్జనం రద్దు!