తెలుగు భాషకు కళాత్మక సౌందర్యం ఉంది. అతి ప్రాచీనమైన ఈ భాషలో సాహిత్యం చాలా గొప్పదని ఫ్రాన్స్‌లోని ప్రాచ్య భాష, నాగరికతల జాతీయ సంస్థ ఆచార్యులుగా సేవలందిస్తోన్న డానియెల్ నేజర్స్ తెలిపారు. తెలుగు భాషపై ప్రేమతో... ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వచ్చిన ఆయన ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.
మాతృభాషలోనే బోధన జరగాలి
చిన్నప్పటి నుంచే ఎవరికైనా మాతృభాష సహజసిద్ధంగా వస్తుందని... వ్యాకరణ తర్కం దానంతట అదే వచ్చేస్తుందని డానియెల్ తెలిపారు. అమ్మ భాషలో నేర్చుకుంటే ఆలోచన శక్తి విస్తృతమవుతుందని స్పష్టం చేశారు. మాతృభాషపై పట్టు సాధించగలిగితే పరభాషలు నేర్చుకోవటం ఏ మాత్రం కష్టం కాదని ఆయన వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌లోని దేశాల్లో మాతృ భాషలోనే బోధనకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. ఫ్రాన్స్ దేశస్థుడైన ఆయన తెలుగుభాష, సంస్కృతులపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించే దిశగా ప్రభుత్వం కృషి'