Dalitha Bandhu Scheme Implementation : రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున లబ్ధిదారుల్ని ఎంపిక చేసి ఈ పథకం అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం, సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రితోపాటు ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అనుమతిచ్చిన నాలుగు మండలాల్లో పరిమితి లేకుండా అమలు చేయనుంది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల పేరిట ప్రత్యేక ఖాతాల్లో రూ.10 లక్షలు జమచేయాలని, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అదనంగా లబ్ధిదారులున్నట్లు గుర్తిస్తే వారికి అవసరమైన నిధులు ఇవ్వాలని తెలిపింది.
హుజూరాబాద్‌లో 18వేల కుటుంబాలు..
Dalitha Bandhu Scheme Telangana : దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక విధానంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18 వేల కుటుంబాలు, వాసాలమర్రిలో 70 కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. మిగతా నాలుగు మండలాల్లో అర్హులైన కుటుంబాల సర్వే జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అర్హులైన 100 కుటుంబాల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలనే విధివిధానాలపై ఎస్సీ సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఏదైనా ప్రభుత్వ పథకం కింద లబ్ధిదారుగా లేనివారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. నియోజకవర్గానికి వంద మంది చొప్పున పరిమితి విధించడం కన్నా.. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రెండు, మూడు గ్రామాలను ఎంపిక చేసి అక్కడి కుటుంబాలకు పూర్తిగా లబ్ధిచేసే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఎస్సీ సంక్షేమశాఖ దీన్నీ పరిశీలిస్తోంది.
నాలుగు మండలాలకు నిధుల పంపిణీ పూర్తి
Dalitha Bandhu Scheme Implementation Telangana : రాష్ట్రప్రభుత్వం మరో నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ఒక్కో మండలంలో దళితబంధు అమలు చేసేందుకు రూ.250 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ నుంచి బుధవారం నిధులు విడుదలైన వెంటనే జిల్లా కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ వాటిని బదిలీ చేసింది. చింతకాని (మధిర, ఖమ్మం), తిరుమలగిరి (తుంగతుర్తి, సూర్యాపేట), చారకొండ (అచ్చంపేట, నాగర్‌కర్నూల్), నిజాంసాగర్ (జుక్కల్, కామారెడ్డి) మండలాల్లో ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సమగ్ర కుటుంబసర్వే ప్రకారం చింతకాని మండలంలో దళితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ నియోజకవర్గానికి రూ.100 కోట్లు విడుదలయ్యాయి. మిగతా మూడు నియోజకవర్గాలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ మండలాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది.