తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే చాలు... అక్కడ గ్యాస్ సిలిండర్ మాయం కావాల్సిందే. తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు... మద్యం దుకాణాలు, రోడ్ల పక్కన ఉండే దుకాణాల్లో గ్యాస్ సిలిండర్లు దొంగిలిస్తున్న నేరగాడు.. రాచకొండ మీర్‌పేట్ పోలీసులకు చిక్కాడు. మీర్‌పేట్ ప్రాంతంలో వివేక్‌నగర్ కాలనీలో నివసించే సభావత్ రవి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదాయం సరిపోకపోవడం వల్ల దొంగతనాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. అందరి దొంగల్లా కాకుండా గ్యాస్ సిలిండర్లు చోరీ చేయాలని ఆలోచించాడు.
మద్యం దుకాణాలు, రోడ్డు పక్కన ఉండే చిన్న షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లు.. ఇలా అదనుచూసి సిలిండర్లు చోరీ చేయడంలో ఆరి తేరాడు. ఎవరికీ అనుమానం రాకుండా గ్యాస్ సరఫరా చేసే వ్యక్తిలా వచ్చి ఆటోలో సిలిండర్ తీసుకొని పరారవుతాడు. ఆటోలో సిలిండర్లతో వెళ్తున్న ఇతన్ని పోలీసులు తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చి ఆపి ప్రశ్నించారు. దీంతో గుట్టురట్టయింది. సిలిండర్లను ఏం చేస్తావని పోలీసులు ప్రశ్నించగా... జుమ్మేరాత్ బజార్‌తో సగం ధరకు అమ్ముతానని తెలిపాడు. పోలీసులు నిందితుడి నుంచి 30 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని.. రిమాండ్‌కు తరలించారు.