రోడ్డు ప్రమాదాల బారినపడి దుర్మరణం చెందుతున్నవారిలో ద్విచక్ర వాహనదారులే 60శాతం ఉంటున్నారు. సైబరాబాద్ పోలీసులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన అధ్యయనంలో హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. గతేడాది 31 లక్షల చలాన్లు విధించారు.
అయినా కొందరు వాహనదారుల తీరు మారకపోవడంతో ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో ప్రధాన రహదారులపై 7 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కిన వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఐఎస్‌ఐ ముద్ర ఉన్న హెల్మెట్‌ను కొనుగోలు చేసి చూపిస్తేనే వాహనం తిరిగి ఇస్తున్నారు. ఈ తరహాలో సుమారు 25 వేల మంది వాహనదారులు కొనుగోలు చేసినట్లు ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో తొలిసారి పట్టుపడితే నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలు, రెండోసారి దొరికితే శాశ్వతంగా రద్దు చేయొచ్ఛు ఆ మేరకు 2019, 2020లో 4319 మంది వాహనదారుల లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. మద్యం తాగి తీవ్ర రోడ్డు ప్రమాదాలకు కారణమైతే ఆ వాహనదారుడి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్లలో 327 మందివి రద్దుచేయాలంటూ ఆర్టీఏ అధికారులకు లేఖలు రాశారు. దీంతో వాహనదారుల్లో కొంతవరకు మార్పు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఆర్టీఏ అధికారులు సహకరిస్తారా?
లైసెన్స్‌ల రద్దు విషయంలో ఆర్టీఏ అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఝలక్ ఇస్తున్నారు. రెండేళ్లలో 4646 డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేయగా.. ఆర్టీఏ అధికారులు 743 మాత్రమే రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
- ఇదీ చూడండి : రోడ్డు భద్రతా వారోత్సవాల్లో జూ. ఎన్టీఆర్ సందేశం