పోలీసు శాఖలో మహిళలకూ ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన షి పాహి కార్యక్రమానికి.. ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టితో పాటు మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రాతో కలిసి ఆయన పాల్గొన్నారు. మూడు క్విక్ రెస్పాన్స్ వాహనాలు, షీ షటిల్ వాహనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొత్తగా వచ్చిన మహిళా కానిస్టేబుళ్లు సాంకేతికత వినియోగంలో ముందు ఉంటున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ కానిస్టేబుళ్లు కొంతమంది ద్విచక్రవాహనాలపై గస్తీ తిరుగుతున్నారని వెల్లడించారు. ట్రాఫిక్, సైబర్ క్రైంతో పాటు అన్ని విభాగాల్లో మహిళా పోలీసులు ఉన్నారని సజ్జనార్ పేర్కొన్నారు. షీ టీమ్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో షీ టీమ్ తరహా కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని వివరించారు. ట్రాఫిక్, సైబర్ క్రైంతో పాటు అన్ని విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన షీ షటిల్ బస్సుల్లో.... నెలకు 60 వేల మంది ప్రయాణిస్తున్నారని అన్నారు.
కేవలం సినిమాలో నటించేవారినే స్టార్ అని అనడం కాదని.. శాంతి భద్రతలు కాపాడే ప్రతి ఒక్క పోలీసు అధికారి కూడా ఓ స్టార్ అని సినీ నటి అనుష్క శెట్టి అన్నారు. కొవిడ్ సమయంలోనూ పోలీసులు ఎంతో బాగా పనిచేశారన్నారు. ఇంత మంది మహిళా పోలీసులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
2014లో మొదలు పెట్టిన షీమ్స్.. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. బాధిత మహిళలకు అండగా ఉంటున్న భరోసా కేంద్రాల సంఖ్య భవిష్యత్తులో మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు అవార్డులు ప్రధానం చేశారు.
ఇదీ చూడండి : అందరూ మెచ్చే ఆహ్లాదకర సిరీస్.. కంబాలపల్లి కథలు