రాజమండ్రి సమీపంలోని రామచంద్రరావుపేటకు చెందిన వంశీకృష్ణ అలియాస్ హర్ష ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలున్న వైద్యవిద్యార్థినులే లక్ష్యంగా ఆరేళ్ల నుంచి మోసాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్‌లో తాను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానినంటూ వారికి స్నేహపూర్వక అభ్యర్థనలు పంపించేవాడు. జన్మదినం, ఇతర సందర్భాలకు శుభాకాంక్షలు, చిరు కానుకలను పంపించేవాడు. వారికి నమ్మకం కలిగాక అత్యవసరంగా డబ్బు కావాలని, వెంటనే తిరిగి ఇచ్చేస్తానంటూ రూ.లక్షల్లో తీసుకునేవాడు.
ఒకటి, రెండుసార్లు తిరిగి ఇచ్చాక రూ.10 లక్షలు, ఆపై నగదు కావాలంటూ కోరేవాడు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండేళ్ల క్రితం కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
ఏడాదిన్నర వ్యవధిలో హైదరాబాద్, విజయవాడల్లో చదువుకుంటున్న 45 మంది వైద్య విద్యార్థినులను పరిచయం చేసుకుని రూ.3.2 కోట్లు వసూలు చేసుకున్నాడు. ఓ వైద్య విద్యార్థిని రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అతనికి ఇచ్చిందంటే అతను ఎంతలా మాయమాటలు చెప్పాడో అర్థం చేసుకోవచ్ఛు వాటిని అతను తిరిగి ఇవ్వకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వంశీకృష్ణ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
లైంగిక వేధింపులు.. బెదిరింపులు..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలున్న యువతులు, మహిళలతో సైబర్ నేరస్థులు తొలుత మర్యాదగా మాట్లాడతారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి వీడియోలు, నగ్నచిత్రాలుగా మార్చి వారి చరవాణులకు పంపుతారు. తమ డిమాండ్లు వారికి వివరించి బెదిరిస్తారు. ఒకటి, రెండు నగ్న చిత్రాలను ముఖం కనిపించకుండా సామాజిక మాధ్యమాల్లో ఉంచుతారు. భయపడిన కొందరు బాధితులు డబ్బులిస్తే మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులతో 2 నెలల్లో ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అపరిచితులతో ఛాటింగ్ చేయవద్దని, వారి అభ్యర్థనలను మన్నించవద్దంటూ హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ (నేర పరిశోధన) హెచ్చరించారు.