80రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలతో చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.... వారి డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలతో బీఆర్కే భవన్‌లో సమావేశం నిర్వహించారు. గ్రామ రెవెన్యూ సహాయకులు కోరుతున్న ప్రధాన డిమాండ్లపై ఈ భేటీలో చర్చించారు. మునుగోడు ఉపఎన్నిక కోడ్ ఎత్తివేసిన అనంతరం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని CS తెలిపారు. వెంటనే విధుల్లో చేరాలన్న సీఎస్ సూచనకు.... గ్రామ సహాయకులు అంగీకరించారు.
వీఆర్ఏల డిమాండ్లలలో ప్రధానంగా. ఉద్యోగ క్రమబద్ధీకరణ-సర్వీసు నిబంధనలు, పే స్కేల్ వర్తింపు, పదోన్నతి, వారసత్వ ఉద్యోగాల కల్పన, సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవు దినంగా గుర్తించి వేతనం మంజూరు, పోలీసు కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన వారికి నష్టపరిహారం చెల్లింపు అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 23వేల 46 వీఆర్ఏల పోస్టులు ఉండగా.... 21వేల 400 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. VRAల అర్హతలపై IAS అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా పేస్కేలు వర్తింపజేయనున్నారు. అర్హులైన వారికి జూనియర్ అసిస్టెంటు, రికార్డు అసిస్టెంటు, అటెండరు పోస్టులను కేటాయిస్తారు. వేతనం 19 వేల నుంచి 24వేల 280 మధ్య ఉండే అవకాశం ఉంది. సమ్మె కాలంలో మృతిచెందిన వీఆర్ఏలకు నష్టపరిహారం చెల్లించే అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని CS సోమేశ్‌కుమార్ తెలియజేసినట్లు తెలిసింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వచ్చే నెల 7న వీఆర్‌ఏలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల చొరవతో చర్చలు జరిగాయని..... అన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ఇవాళ్టి నుంచి వీఆర్‌ఏలు విధులకు హాజరవుకానున్నట్లు ట్రెసా, వీఆర్ఏ ఐకాస స్పష్టం చేసింది.
జులై 25న వీఆర్‌ఏలు నిరవధిక సమ్మె ప్రారంభించగా... రాష్ట్రంలోని 590 తహసీల్దారు కార్యాలయాల ఎదుట షామియానాలు ఏర్పాటు చేసుకుని నిరవధికంగా దీక్షలు చేపట్టారు. గత నెల 13న అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. . స్పందించిన మంత్రి కేటీఆర్ రెండు దఫాలు చర్చలు జరిపారు. అయినా స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తూ వచ్చారు. రెండ్రోజుల క్రితం మహిళా వీఆర్‌ఏలు హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టడం, లాఠీఛార్జి చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నికలోనూ వందలమంది వీఆర్‌ఏల తరఫున పోటీకి దిగాలని భావించారు. 15, 16 తేదీల్లో మునుగోడు నుంచి ప్రగతిభవన్‌కు పాదయాత్రకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమ్మెకు తెరపడింది.
ఇవీ చదవండి: