ఇటీవల కురిసిన వర్షాలు 28 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 24 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. గడచిన నాలుగు రోజుల్లో మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగతా జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. బుధవారం కాస్త తెరపించినప్పటికీ... ఇంకా నీరు పొలాల్లోనే నిలిచి ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజే భారీ వర్షాలు రావడంతో.. తొలుత 3 లక్షల ఎకరాల్లో వరద నీరు చేరింది. ప్రస్తుతం లక్ష ఎకరాలకుపైగా పంటల్లో నీరు నిలిచే ఉంది.
వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహించడం వల్ల వరద ఉద్ధృతి ప్రభావంతో 23 వేల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలు పంటలు నీటి మునిగాయి. వరంగల్ జిల్లాలో వరి, వేరుశనగ, పత్తి, మిరప, బొప్పాయి పంటలు 4 వేల 390 ఎకరాల విస్తీర్ణంలో నీట మునిగి దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లాలో 2 వేల 517 ఎకరాలు, ములుగు జిల్లాలో 15 వేలు, జయశంకర్ భూపాలపల్లిలో 8 వేలు, మహబూబాబాద్ జిల్లాలో 2 వేల 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలో 6వేల 822 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు నీటి మునగ్గా... నిర్మల్ జిల్లాలో 25 వేల ఎకరాల్లో సోయాబీన్ సహా వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లాలో 3 వేల ఎకరాలు, మంచిర్యాలలో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 19 వందల ఎకరాల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 వేల 786 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు నీటి మునగ్గా... జగిత్యాల జిల్లాలో 600 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 490 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు అంతర్గతంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం అందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు..
24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తాజాగా నీట మునిగిన పత్తి, వరి, కంది, సోయాబీన్, మొక్కజొన్న, కూరగాయల పంటలపై క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. నీరు ప్రవహించి పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. కొన్నిచోట్ల భూములు కోతకు గురయ్యాయి. వీలైనంత మేరకు పంటల నష్టాన్ని తగ్గించేందుకు వ్యవసాయ అధికారులు సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పొలాల్లో నుంచి మురుగు నీరు పోయేందుకు వీలుగా కాలువలు తీసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. ముంపునకు గురైన వరి పొలాల్లో మురుగు నీరు తీసివేయడంతోపాటు తాత్కాలికంగా నత్రజని ఎరువులు వేయడం ఆపేయాలని సూచించారు.
సమాచార సేకరణకు ఉపక్రమించకపోవడంపై అసహనం..
అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. రెవెన్యూ, వ్యవసాయ ఆధికారులు సమాచార సేకరణకు ఉపక్రమించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. వ్యవసాయ శాఖ రంగంలోకి దిగి నష్టంపై శాస్త్రీయంగా సమగ్ర నివేదికలు రూపొందించి ఎకరానికి 25 వేల రూపాయల పరిహారం చెల్లించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: Rain Effect: వర్షాలతో నిజామాబాద్ జిల్లా అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్తం