పోలీసుస్టేషన్ అంటే భయాన్ని పోగొట్టేదిలా ఉండాలి. ఠాణా తలుపు తడితే న్యాయం జరుగుతుందన్న భావన కల్పించగలగాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్ర పోలీసు శాఖ గత కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఘటన ఎక్కడ జరిగినా, బాధితులు తమకు అందుబాటులోని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసే సౌలభ్యాన్ని కల్పించింది. రెండేళ్ల నుంచి ఈ పద్ధతిలో కేసులు నమోదు చేస్తున్నారు. మొదట్లో చక్కగా అమలైన ఈ విధానం ఇటీవల అటకెక్కింది. నగరంలో చోటుచేసుకున్న రెండు ఘటనల విషయంలో బాధితులకు జరిగిన అన్యాయం నేపథ్యంలో మళ్లీ ఈ విధానం చర్చకొచ్చింది.
శంషాబాద్ పరిధిలో 2019 నవంబరులో అత్యంత పాశవికంగా దిశ ఘటన జరిగింది. బాధిత కుటుంబం వెంటనే శంషాబాద్ ఆర్జీఐ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తమ పరిధిలోకి రాదని, శంషాబాద్ రూరల్ ఠాణాకు వెళ్లమని పంపించారు. అక్కడికెళితే ఆర్జీఐ పరిధిలోకే వస్తుందని తిప్పిపంపారు. ఈ వ్యవహారం అప్పట్లో వివాదస్పదమైంది. పోలీసుల తీరుపై పెద్దఎత్తున విమర్శలు రేగాయి. సమీక్షించిన డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని తీసుకొచ్చారు.
బాధితులు ఏ ఠాణాలో ఫిర్యాదు చేసినా... అక్కడి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సంబంధిత ఠాణాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కొన్నాళ్లపాటు ఈ విధానం చక్కగా అమలైనా... తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అత్యాచారం జరిగిందని చెప్పినా..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు సహాయకులుగా భార్య, మరదలు వచ్చారు. రెండు రోజుల కిందట వారిపై ఆసుపత్రి ఉద్యోగి సహా మరికొందరు అత్యాచారం చేశారని ఆరోపిస్తూ బంధువులు సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ ఒకటో టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. తమ పరిధిలోకి రాదంటూ జీరో ఎఫ్‌ఐఆర్ చేయడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో హైదరాబాద్ వచ్చి చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సోమవారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అంతటా.. ఇదే తంటా
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 153 వరకు లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. చాలా ఠాణాల్లో జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అమలు కావడం లేదు. బాధితులు తమకు దగ్గరలోని ఠాణా పోలీసులను ఆశ్రయిస్తున్నా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సంబంధిత ఠాణాకు బదిలీ చేయడానికి ఒప్పుకోవడం లేదు. డీజీపీ మహేందర్‌రెడ్డి మరోసారి సమీక్షించి ఈ విధానం వంద శాతం అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Gandhi Hospital Rape: గాంధీలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం..!