Vijay Sethupati Bengaluru Airport Incident : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదైంది. విజయ్ సేతుపతితోపాటు.. అతని మేనేజర్ జాన్సన్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాపేట కోర్టులో మహా గాంధీ కేసు వేశారు. గత నెలలో బెంగుళూరు విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తి విజయ్ సేతుపతిపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన విజయ్ సేతుపతి మేనేజర్ అతడిని వారించారు. ఈ ఘటన విజయ్ సేతుపతిని ఇప్పట్లో వదిలేలా లేదు.
ఘటన జరిగిన అనంతరం విజయ్ సేతుపతిపై కోర్టులో పరువు నష్టం దావా వేసిన గాంధీ.. తాజాగా క్రిమినల్ కేసు పెట్టారు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నానని.. బెంగుళూరు ఎయిర్ పోర్టులో సేతుపతిని కలిశానని.. ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో విజయ్ సేతుపతితోపాటు అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదు చేశాడు.
తను కూడా నటుడిని కాబట్టే సూపర్ డీలక్స్ చిత్రానికి విజయ్ సేతుపతిని ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చినందుకు ప్రశంసించినట్లు తెలిపాడు. అయితే విజయ్ తనతో అసభ్యంగా మాట్లాడి కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై జరిగిన దాడిలో తన చెవికి దెబ్బ తగిలిందని, చెవి పూర్తిగా వినిపించడం లేదన్నాడు.
తాజా ఫిర్యాదులో అసలు విజయ్ సేతుపతి, అతని మేనేజర్‌పై తాను దాడే చేయలేదని పేర్కొన్నాడు మహా గాంధీ. తనపై మద్యం సేవించి ఉన్నాడని విజయ్ సేతుపతి తప్పుడు ప్రచారం చేశారని.. తద్వారా తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిందని ఇప్పటికే రూ. 3 కోట్లు పరువు నష్టం దావా వేసిన మహా తాజాగా క్రిమినల్ కేసు పెట్టారు.