CPM Mahasabhalu: ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. మహాసభలకు ముఖ్య అతిథిగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఆయనతోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బీవీ రాఘవులు ఉన్నారు. సీతారం ఏచూరి పార్టీ పతాకాన్ని ఎగురవేసి మహా సభలను ప్రారంభించారు.
అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని సీతారాం ఏచూరి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని.. కొవిడ్ తర్వాత సంక్షోభం మరింత ముదిరిందని తెలిపారు. అందరికీ టీకా అందించటంలో సమానత్వం ఉండాలని సూచించారు. కేంద్రం తెచ్చిన ఉద్దీపన ప్యాకేజీ వల్ల కంపెనీల లాభాలు పెరగడం తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. చిలీ, పెరూ వంటి దేశాల్లో కమ్యూనిస్టులు బలపడుతున్నారని సీతారం ఏచూరి తెలిపారు.
దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. హిందుత్వ ఉన్మాదంతో దేశాన్ని కలుషితం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అటకెక్కింది. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదు. పోలవరం ప్రాజెక్టు పనులు జరగట్లేదు. రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు భాజపాకు సహకరిస్తున్నాయి. మూడు రోజుల సమావేశాల్లో చర్చించి రాజకీయ కార్యాచరణ ఖరారు చేస్తాం. - మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చదవండి: గంగాజలం పోయగానే కళ్లు తెరిచి మాట్లాడిన శవం!