కరోనా మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీని మరింత వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా చూపించడానికే పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని ముషీరాబాద్, భోలక్పూర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రెండో డోసు వ్యాక్సిన్ కోసం సిబ్బంది వద్ద సరైన సమాచారం లేదని, వందలాది మంది వ్యాక్సిన్ కోసం రాగా కేవలం 70 నుంచి వంద మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారని వివరించారు.
ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో కరోనా నిర్ధారణ పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. వ్యాక్సిన్ విస్తృత పరచడానికి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి 'కరోనాపై గెలవాలంటే కఠిన చర్యలు తప్పనిసరి'