కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతున్న ప్రధాని మోదీ.. రైతులతో, రైతు సంఘాలతో చర్చించకుండానే చట్టాలను ఎలా తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. 25 రోజులుగా రైతులు రోడ్లపై ఆందోళన చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కష్టాల్లో ఉన్నారని.. వారి కష్టాలు తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మొండి వైఖరిని విడనాడి చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. నరేంద్రమోదీ నమస్కారాలు చేస్తూ సంస్కారహీనులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత రైతు ఉద్యమంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే తన మౌనం వీడాలని విజ్ఞప్తి చేశారు. ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అనే విధంగా కేసీఆర్ వ్యవహారశైలి ఉందన్నారు.
ఇదీ చూడండి: విద్యుత్ ఆదా.. ఉత్పత్తితో సమానం : సందీప్ సుల్తానియా