హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో వందలాది కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఇళ్ల స్థలాల కోసం 1994లో ఆనాటి ప్రభుత్వం 67 ఏకరాల 17 గుంటల భూమిని సొసైటీకి అప్పగించిందని పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో పనిచేసే వారే ఈ సొసైటీలో సభ్యులుగా ఉండాలని ఇతరులెవ్వరికీ అవకాశం లేదని వివరించారు.
4 వేల 8 వందల మంది సభ్యులు ఉండే సొసైటీలో ఇతర వ్యక్తులతో సభ్యత్వాన్ని 9 వేలకు పెంచారని ఆక్షేపించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే సినీ పరిశ్రమ నాయకులు ఫిర్యాదు చేసినా... అధికారులు తూతూమంత్రంగా విచారణ జరిపి గాలికి వదిలేశారన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే సీబీసీఐడీ ద్వారా చిత్రపురి హౌసింగ్ సొసైటీపైన విచారణ జరిపించాలని చాడ డిమాండ్ చేశారు.