మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భాజపాలో చేరాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరమని సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. తాను చేస్తోన్న అప్రతిష్ఠాకరమైన పనిని కప్పిపుచ్చుకోవడానికి కమ్యూనిస్టులపై విమర్శలు చేయడాన్ని తమ్మినేని తీవ్రంగా ఖండించారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా ఫాసిస్టు భాజపా పంచన చేరడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాకంటక పాలన సాగిస్తోందని... లౌకిక విలువలను గంగలో కలిపి మతోన్మాద రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం భాజపా లాంటి ప్రమాదకర పార్టీని ఈటల ఎంచుకోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైన ఈటల పునరాలోచించుకోవాలని తమ్మినేని సూచించారు.