విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దొరైస్వామి రాజా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు శక్తులకు అప్పజెప్పే ప్రక్రియపై పునరాలోచన చేయాలని కోరారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లో 100 శాతం పెట్టుబడులను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను.. తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ కంపెనీ నవరత్న హోదాని కల్గి ఉందని చెప్పారు. అలాంటి ఫ్యాక్టరీని ఏ ప్రైవేటు కంపెనీకి అప్పగించినా దానికి సంబంధించిన లక్షల కోట్ల విలువ చేసే భూమిని కూడా ఆ కంపెనీ లాక్కుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
50 సంవత్సరాల క్రితమే ఈ పరిశ్రమ కోసం తెలుగు ప్రజలు సుమారు 23 వేల ఎకరాల విలువైన భూమిని ఇచ్చినట్టు డి.రాజా గుర్తు చేశారు. ఆ సమయంలో భూములిచ్చిన రైతులకు సరైన పరిహారం చెల్లించలేదన్నారు. ప్లాంట్‌ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రయత్నమూ చేయలేదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఖనిజ గనులను కేటాయించి ఉంటే.. సంస్థ నష్టాల్లోకి పోయి ఉండేది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి