కరోనా విలయతాండవం చేస్తున్న దృష్ట్యా. దేశవ్యాప్తంగా 20 వేల రైల్వే బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మారుస్తామని, తద్వారా 3 లక్షల పైచిలుకు పడకలు అందుబాటులోకి వస్తాయని లాక్‌డౌన్ ప్రారంభంలో రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 16 రైల్వే జోన్ల పరిధిలో 5,601 బోగీల్ని ఐసొలేషన్ వార్డులుగా మార్చింది. మధ్య బెర్తులను తొలగించడం, ఒక టాయిలెట్‌ను స్నానాల గదిగా మార్చడం, మధ్యమధ్యలో ప్లాస్టిక్ తెరలను ఏర్పాటుచేయడం వంటి మార్పుల కోసం ఒక్కో బోగీకి రూ.60 వేల పైచిలుకు ఖర్చుచేశారు.
దేశవ్యాప్తంగా ఇలా బోగీలను మార్చడానికి దాదాపు రూ.34 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కూడా 486 ‘కొవిడ్ బోగీ’లను సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో కొన్నింటిని, కాచిగూడ స్టేషన్‌లో మరికొన్నింటిని అందుబాటులో ఉంచింది. వాటిలో చికిత్స పొందడానికి ఒక్క రోగీ రాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఐదారు నెలలుగా ఖాళీగా ఉంటున్న వీటిని తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ యోచిస్తోంది.