రాష్ట్రంలో అత్యధిక ప్రాంతం ఏజెన్సీగా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి అంతరాలను తొలగించాలని సామాజిక అభివృద్ధి మండలి అధ్యయనం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలంది. ఆరోగ్యం, విద్య, గృహవసతి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కార్యాచరణను రూపొందించాలంది.
రాష్ట్రంలోని భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులపై సామాజిక అభివృద్ధి మండలి (సీఎస్‌డీ) అధ్యయన నివేదికను విడుదల చేసింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, జలవనరులు, ఆర్థిక సమ్మిళితం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు అనే కీలకాంశాలపై అధ్యయనం చేశారు.
అధ్యయనంలోని ప్రధానాంశాలు
* ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికులు తాత్కాలిక నివాసాల్లోనే ఉన్నందున పక్కా గృహాల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలి.
* నాలుగు శాతం మంది యువతే నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్నందున దీనిపై విస్తృత అవగాహన పెంచాలి.
ఆరోగ్యం:
ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుజ్జీవనం చేయడంతో పాటు అన్ని ఆవాస ప్రాంతాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* నిత్యావసర సరకులు అందించే చౌకదుకాణాలు లేని గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా పౌర సరఫరాల ఉప పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* గర్భిణుల వివరాలను సకాలంలో నమోదు చేసి వారికి మెరుగైన వైద్యసేవలందించాలి. తరచూ వైద్య పరీక్షలను నిర్వహించాలి.
* ఆరోగ్య రిజిస్టర్లు నిర్వహించాలి. బాలామృతం పథకాన్ని పటిష్ఠం చేయాలి.
* ఏఎన్‌ఎం, ఆరోగ్య కేంద్రాలు, ఆశావర్కర్ల మధ్య సమన్వయం ఉండాలి.
* ప్రతి మండలానికి ప్రత్యేకంగా ప్రసూతి అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలి.
విద్య: విద్యార్థుల నమోదును పక్కాగా గుర్తించాలి.
పాఠశాలల్లో మెరుగైన బోధన వసతులు కల్పించాలి.
* చదవడం, లెక్కలు వేయడం వంటివి చేయగలిగేలా ఉండాలి.
* విద్య గురించి బాలికలకు అవగాహన కలిగించి డ్రాపవుట్‌లను తగ్గించాలి.
* విలేజ్ ఎడ్యుకేటర్‌ను నియమించాలి.
* పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాలి.
వ్యవసాయం: వ్యవసాయానికి మరింత అవకాశం ఉంది.
* ఉపాధి హామీలో చిన్ననీటి వనరులను పునరుద్ధరించాలి.
* నాణ్యమైన విత్తనాల లభ్యతను పెంచాలి. వ్యవసాయశాఖ సేవలను బలోపేతం చేయాలి.
* సంచార పశువైద్య ఆస్పత్రులు అందుబాటులో ఉండాలి.
* పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో ఎక్కువమంది రైతుబంధు, రైతుబీమా లబ్ధిపొందలేకపోతున్నారు.
* సాగులోని భూమి, సాగునీటి వసతి ఉన్న భూముల మధ్య అంతరం ఉంది.
* చెరువులను పునరుద్ధరించాలి.
* అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలి. కనీస వసతులు కల్పించాలి: అందరికీ ఇళ్లను నిర్మించే అంశాన్ని తక్షణ ప్రాధాన్యంగా తీసుకోవాలి.
* అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్‌తో కంప్యూటర్లను అందించాలి.
* రహదారుల్లేని గ్రామాల్లో వాటిని తక్షణ ప్రాధాన్యంగా చేపట్టాలి.