విధుల్లో ఎప్పుడు చేరతావని అడిగేవారు
ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నాను. నాకు కరోనా సోకింది. సహచరులు ధైర్యం నూరిపోశారు. నేను చికిత్స పొందుతున్న సమయంలో రోజుకి రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఐసోలేషన్ గడువు ముగుస్తున్న సమయంలో ఎప్పుడు విధుల్లో చేరతావంటూ అడిగేవారు. ‘ఇంట్లో ఎంత కాలం ఉంటావ్.. త్వరగా వచ్చేయ్’ అంటూ చమత్కరించేవారు. ఆ మాటలే త్వరగా కోలుకునేలా చేసి ఉత్సాహంగా తిరిగి పనిలోకి వెళ్లేలా చేశాయి.
-వైద్యురాలు
సాదర స్వాగతం పలికారు
- శ్రీనివాస్, అడ్మిన్ ఎస్.ఐ, బంజారాహిల్స్ ఠాణా
కరోనా పాజిటివ్ వార్త తెలిసిన తర్వాత సహచరులు పూర్తి మద్దతు ఇచ్చారు. వారి భరోసాతోనే త్వరగా కోలుకున్నాను. విధుల్లో చేరే రోజున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వచ్చి అభినందించారు. సహచరులంతా చప్పట్లతో నాకు సాదర స్వాగతం పలికారు. మళ్లీ మునుపటి వాతావరణంలో ఎప్పటిలా పని చేసుకోగలుగుతున్నాను.
రోజుకొకరు భోజనం పంపించేవారు
ఉద్యోగరీత్యా చాలా దూరం నుంచి హైదరాబాద్ వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్నాను. నాకు కరోనా వచ్చింది. ఇంటికెళ్లేందుకు అవకాశం లేదు. ఏదైనా ఆసుపత్రిలో చికిత్స తీసుకుందామన్నా అవకాశం లేకుండా పోయింది. అప్పుడే అపార్ట్‌మెంట్‌లో ఉన్న సహచరులు స్పందించారు. రోజుకొకరు నాకు భోజనం పంపించారు. మందులు, సరకులు తెచ్చి ఇచ్చారు. వైద్యసదుపాయాలు కల్పించారు. నా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. వారి సాయం తెలుసుకుని అమ్మానాన్న సంతోషించారు. చుట్టుపక్కల ఉన్నవారి అండతోనే కొవిడ్‌ను జయించగలిగాను.
-ఐటీ ఉద్యోగిని