భాగ్యనగరంలో కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కొవిడ్ నిబంధనలతోపాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ సాగించాలని ప్రభుత్వం పేర్కొంది. చాలా చోట్ల ఆ నిబంధనలే కానరావడంలేదు. ఇప్పటికే దిల్లీ, కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరంలోనూ పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కానీ ఈ హెచ్చరికలేవీ చెవికి ఎక్కడం లేదు. అన్‌లాక్ మొదట్లో మాస్క్ లేనిదే ‘నో ఎంట్రీ’ బోర్డులు ఉండేవి. కొన్నిరోజులు నిబంధనలు కచ్చితంగా పాటించారు. క్రమంగా అన్నీ వదిలేశారు. గ్రేటర్‌తోపాటు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇదే ఉదాసీనత ప్రదర్శిస్తే రెండో దశ తప్పదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివి
● బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. గుంపులకు దూరంగా ఉండాలి.
● హోటళ్లలో టేబుళ్ల మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. ఆహారం సరఫరా చేసే వారు మాస్క్‌లు ధరించడం...చేతికి గ్లౌజులు వేసుకోవాలి. మార్కెట్లలో కూరగాయల విక్రేతలకు మాస్క్ తప్పనిసరి.
● జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం లాంటి లక్షణాలు ఉంటే.. ప్రత్యేక గదిలో హోం ఐసోలేషన్‌లో ఉండాలి. కరోనా పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ వచ్చి ఇంటి నుంచే చికిత్స పొందేవారు ఎట్టి పరిస్థితిల్లోనూ బయటకు రాకూడదు.
● ఇంట్లో ప్రత్యేకంగా ఉండటం కష్టమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చేరాలి.
● ఈ నిబంధనలు పాటించకపోతే అమాంతం వైరస్ విస్తృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.