రాజధానిలో దాదాపు 40 వేల మందికి కరోనా వైరస్ సోకగా 25 వేలమంది వరకు జయించారు. ఇంకా 15 వేలమంది ఇళ్లలోను, వివిధ ఆసుపత్రుల్లో ఉండి వైద్యం పొందుతున్నారు. రోజూ 500 మంది, ఆపైన కొవిడ్ బారిన పడుతున్నారు. పరీక్షల సంఖ్య పెరిగితే రోగుల సంఖ్య ఇంకా హెచ్చుగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చాలా కేంద్రాల్లో 25 పరీక్షలకే పరిమితం చేస్తున్నారు. వీటికోసం తెల్లవారుజామునే వెళ్తున్నా అందరికీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అనేకమంది లక్షణాలున్నా వెనుదిరగాల్సి వస్తోంది. ఇప్పటికీ అనేక కాలనీలలో జ్వరం. ఇతర లక్షణాలతో బాధపడుతున్నవారు ఉన్నారు. చాలామంది నిర్లక్ష్యంతో పరీక్షలకు వెళ్లడం లేదు.
నగరంలోని రైతుబజార్లతోపాటు మోండా మార్కెట్, జనరల్ బజారు, మరికొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో మొన్నటి వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. శానిటైజర్లను ఏర్పాటుచేశారు.. కొన్నిచోట్ల థర్మల్ స్కీనింగ్ యంత్రాలు కనిపించాయి. పోలీసులు సైతం అక్కడే ఉండి దుకాణదారులను హెచ్చరించేవారు. అక్కడికి వచ్చేవారు ఎడం పాటించేలా చేసేవారు. ఇప్పుడవేవీ లేవు.
మోండా మార్కెట్ ప్రతిరోజూ వేలాదిమంది కొనుగోలుదారులతో నిండిపోతోంది. శ్రావణ శుక్రవారం కూడా రావడంతో గురువారం ఎటుచూసినా కొనుగోలుదారులు, వాహనాలే. రైతు బజార్లలో చాలామంది వ్యాపారులు కనీసం మాస్కులు ధరించడం లేదు. కొంతమంది కేవలం అలంకరణగా పెట్టుకుంటున్నారు. ఇక పానీపూరీల విక్రయాలు రోడ్లపక్కన ఊపందుకున్నాయి. జాగ్రత్తలు కరవవుతున్నాయి. నగరంలో కొవిడ్ నిబంధనల అమలుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను అనేకమంది ప్రస్తావిస్తున్నారు.
పెరిగిన ట్రాఫిక్
సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు ట్రాఫిక్ ఎక్కువ. మార్చి నెలలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి గతనెల వరకు ట్రాఫిక్ బాగా తగ్గిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవి. ప్రస్తుతం ట్రాఫిక్ పెరిగింది. రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య అధికంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. సిగ్నల్స్ దగ్గర వేలాది వాహనాలు ఆగిపోతున్నాయి. 5 శాతం ట్రాఫిక్ పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నామని ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ తెలిపారు.