- గాంధీ ఆసుపత్రి పాతికేళ్ల యువకుడు ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందంటూ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించగా రక్తంలో ఆక్సిజన్ స్థాయి 98 ఉంది. జ్వరం, దగ్గు లేవు. ఊపిరితిత్తులు బాగానే ఉన్నట్టు గుర్తించారు. చుట్టూ జరిగే ఘటనలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాలు అతడిపై ప్రభావం చూపాయి. అతిగా ఆందోళనకు గురవటం వల్లే సమస్య తలెత్తినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
- ఓ వైద్యుడి డ్రైవర్‌కు కొవిడ్ సోకింది. మూడ్రోజుల్లో ఆయన తండ్రి(75)లోనూ లక్షణాలు కనిపించాయి. ఆక్సిజన్ స్థాయి 65కు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చేర్పించారు. మూడ్రోజులకే కోలుకున్నాడు. ఎటువంటి ఆరోగ్య సమస్యల్లేకుండా తనపని తాను చేసుకుంటున్నాడు. ఆ పెద్దాయన మనోబలమే ప్రాణాలు నిలిపిందంటున్నారు మనస్తత్వ నిపుణులు.
భాగ్యనగరంలో కేసుల పెరుగుదల ప్రజల్లో ప్రతికూల ఆలోచనలు, కంగారును రెట్టింపు చేస్తున్నాయని గాంధీ ఆసుపత్రి మానసిక విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ జూపాక అజయ్‌కుమార్ విశ్లేషించారు. అవగాహన లేకుండా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న అంశాలు కొందరిలో తాము వైరస్ బారినపడ్డామనే అనుమానాలకు తావిస్తున్నాయి. ఆందోళన, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం, నీరసం, నిస్సత్తువకు గురవుతున్నారు. కరోనాగా భావించి వైద్యపరీక్షలకు వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ముందుజాగ్రత్తగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి వారు 5-6 శాతం మంది ఉంటారు. విషమ స్థితిలో ఉండే కొవిడ్ రోగులకు ఇలాంటి వారి వల్ల పడకలు లభించడంలేదని ప్రముఖ వైద్యనిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
29 శాతం మంది అనుమానాల నివృత్తికే
కొవిడ్ మొదటి దశలో ఒకరికి వైరస్ వస్తే ఇతరులకు సోకేందుకు 7-8 రోజులు పట్టేది. ప్రస్తుతం 2-3 రోజులకే ఇంటిల్లిపాదీ బాధితులవుతున్నారు. దీన్ని తామెలా తట్టుకోవాలన్న ఆందోళన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్రేటర్‌లో కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 22-35 శాతం మంది అనుమానాల నివృత్తికే వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఆందోళనకు దారితీస్తున్న 3 అంశాలు
- వైరస్ సోకుతుందేమోననే గుబులు
- వస్తే ఎలా అనే భయం
- కోలుకున్నాక భవిష్యత్తు ఆరోగ్యంపై బెంగ జయించిన వారు పడుతున్న ఇబ్బందులివి
- ప్రతి 100 మందిలో 30-40 మందిలో నిద్రలేమి సమస్య.
- హోంఐసొలేషన్‌లో ఉన్న 90 శాతం మంది కొత్త పరిస్థితులకు సర్దుకుపోలేక పోతున్నారు. ఒంటరితనంతో 10-20 శాతం మంది కుంగుబాటుకు గురవుతున్నారు.
- ఐసీయూలో చికిత్స పొందిన 2-3 శాతం మంది పాత అంశాలను గుర్తుచేసుకుంటూ ఉలిక్కిపడుతున్నారు. ఒంటరిగా ఉండటం, తనలో తాను మాట్లాడుకోవటం, తిట్టడం, అసహనం, కోపం వంటివి 4-5 శాతం మందిలో తలెత్తుతున్నాయి.
సానుకూలం మనసుకు వరం
కొత్త వైరస్‌లు వచ్చినపుడు ఇలాంటి పరిస్థితులు సహజం. ప్రతికూల ఆలోచనలు చేయొద్దు. మహమ్మారి నుంచి బయటపడేందుకు బోలెడు మార్గాలున్నాయి. చికిత్స అందించటంలోనూ స్పష్టత వచ్చింది. వ్యాధి నిరోధకశక్తి పెరగాలంటే మనసును దృఢంగా ఉంచుకోవాలి. వైరస్‌ను ఎదుర్కొనేందుకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంతే కీలకం.
- డాక్టర్ జూపాక అజయ్‌కుమార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, గాంధీ వైద్యశాల)
- ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 5,567 కొవిడ్ కేసులు