కరోనా కారణంగా చాలా మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి.. వారిలో కొందరు తిరిగి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. కష్టాన్నే నమ్ముకొని కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయవాడకు చెందిన షేక్ రెహమతుల్లా.. ఆటోనగర్‌లో ఒక షాపు అద్దెకు తీసుకొని బైక్ మెకానిక్ పనులు నిర్వహిస్తూ రోజుకి రూ.వెయ్యి సంపాదించేవారు. కుటుంబంతో హాయిగా జీవించేవారు.
కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా షాపులు మూతపడటంతో జీవితం అగమ్యగోచరమైంది. ఆంక్షలు ఎత్తివేశాక దుకాణం తెరిచేందుకు సిద్ధమవగా అద్దె మొత్తం చెల్లించాలని అడగడంతో.. అప్పులు తెచ్చి కొంత చెల్లించి సామాన్లు తీసుకొని కుటుంబంతో ఆగిరిపల్లికి చేరుకున్నారు. ఒక రిక్షా కొనుక్కొని.. వాహనాల చక్రాలకు గాలి ఎక్కించే యంత్రాన్ని అందులో పెట్టుకొని మొబైల్ పంచర్ షాపులా తయారు చేశారు. విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే రోడ్డులో అవసరమైనచోట పంచర్లు వేస్తూ రోజూ రూ.600 వరకు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం జీవితం బాగానే ఉందని.. త్వరలోనే రిక్షాకు ఇంజిన్ ఏర్పాటుచేసుకుంటానని రెహమతుల్లా ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
- ఇదీ చదవండి : బతుకు 'సాగు' చేస్తున్నాడు..!