రాష్ట్రంలో తాజాగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక వైద్య ఆరోగ్యశాఖ వద్ద కేవలం 535 శాంపిళ్లు మాత్రమే పరీక్షించాల్సి ఉందన్నందున... అనుమానం ఉన్న అందరికీ పరీక్షలు పూర్తైనట్టేనని స్పష్టం చేసింది. తాజాగా నమోదైన 49 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 453కి చేరింది. వీరిలో 397 మంది చికిత్స తీసుకుంటుండగా... 45మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. మరో 11మంది మృతి చెందారు. ఐసీయూలో ఎవరూ లేరని... విదేశాల నుంచి వచ్చిన వారిలో నెగెటివ్ తేలిన వారిని ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్టు మంత్రి ఈటల తెలిపారు.
గచ్చిబౌలిలో భారీ ఆసుపత్రి
రాష్ట్రం నుంచి మర్కజ్‌కు 1100 మంది వెళ్లగా... వారితో కాంటాక్ట్‌లో ఉన్న 3 వేల 188మందికి కరోనా పరీక్షలు పూర్తైనట్టు మంత్రి పేర్కొన్నారు. కరోనా లేనివారిని హోం క్వారంటైన్‌కి తరలిస్తున్నామన్న ఈటల... రాష్ట్రవ్యాప్తంగా 167 క్వారంటైన్ కేంద్రాలు ఖాళీ కానున్నట్టు వెల్లడించారు. గచ్చిబౌలిలో 1500 పడకలతో భారీ స్థాయిలో ఆస్పత్రిని కేవలం 15రోజుల్లో సిద్ధం చేసిన ఘనత వైద్య ఆరోగ్య శాఖకే దక్కిందన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలలకు చెందిన ఆసుపత్రులను కూడా పూర్తిస్థాయిలో కరోనా ఆసుపత్రులుగా మారుస్తున్నామన్నారు.
బీమాకు ఏర్పాట్లు పూర్తి
వైద్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఈటల.... కేంద్ర ప్రభుత్వం వైద్యులకోసం ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 400కోట్లతో మందులను కొనుగోలు చేసినట్టు మంత్రి ప్రకటించారు. 80వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని మరో 5లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. 3.5లక్షల టెస్టింగ్ కిట్ లను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు.
మర్కజ్ వెళ్లివచ్చిన వారిలో కరోనా నిర్ధారణ పరీక్షలు దాదాపు పూర్తైనందున... రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం ఉందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కమ్యునిటీ ట్రాన్స్మిషన్ లేకపోవటం గమనార్హమన్నారు.
ఇదీ చదవండి: కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: సుప్రీం