కొవిడ్ సమయంలోనూ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దృశ్యమాధ్యమ సమావేశంలో... 2020-21 ఆర్థిక ఏడాది పురోగతి వివరాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మీడియాకు వెల్లడించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయడం ద్వారా గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయగలిగామని మాల్యా స్పష్టం చేశారు.
రాకపోకలు తగ్గాయి...
కొవిడ్ మూలంగా రైళ్ల రాకపోకలు స్తంభించడం వల్ల... ఆ ప్రభావం ప్రయాణికుల రాకపోకలపై తీవ్రంగా పడింది. 2019-20 ఆర్థిక ఏడాదితో పోలిస్తే... 2020-21 ఆర్థిక ఏడాదిలో 76.35 శాతం ప్రయాణికుల రాకపోకలు తగ్గినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. గత ఆర్థిక ఏడాదిలో 24.25 మిలియన్ల మందిని వారివారి గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా దక్షిణ మధ్య రైల్వేకి రూ.974.24 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 95.9 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరగ్గా... అంతకుముందు 2019-20 ఆర్థిక ఏడాదితో పోలిస్తే పదిశాతం సరుకు రవాణా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
రైళ్లలో ఏలాంటి రద్దీ పెరగలేదు...
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మనుషులు నిర్వహించే 81 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి-ఆర్వోబీలు నిర్మించినట్లు తెలిపింది. కరోనా నుంచి క్రమంగా కోలుకుని అన్ని రైళ్లను పునరుద్దరణ చేస్తూ వస్తున్నట్లు పేర్కొన్న అధికారులు... దిల్లీ, ముంబయి, కొల్కత్తా, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నాందేడ్, ఔరంగాబాద్, పూణె, తిరుపతి తదితర ముఖ్య ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నట్లు వివరించారు. రైళ్లలో రద్దీ పెరిగినట్లు సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారం నిజం కాదని, రైళ్లలో ఏలాంటి రద్దీ పెరగలేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ జోన్ పరిధిలో 300 కిలోమీటర్లు కొత్తగా రైల్వేలైను నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మరో 750 కిలోమీటర్లు విద్యుద్దీకరణ పూర్తి చేసినట్లు వివరించింది. ప్రమాదాల నివారణకు 321 కిలోమీటర్ల పరిధిలో 34 స్టేషన్లల్లో ట్రైన్ కొల్యూషన్ అవైడింగ్ సిస్టమ్- టీసీఏఎస్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెన్నై-దిల్లీ మార్గంలో 2,828 కిలోమీటర్లు మేర రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచినట్లు వెల్లడించారు.
దశల వారీగా 180 రైళ్ల పునరుద్దరణ...
పార్శల్స్ ద్వారా అత్యధికంగా రూ.108 కోట్లు ఆదాయం వచ్చిందని, దూద్ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా 2020-21 ఆర్థిక ఏడాదిలో అత్యధికంగా 7.3 కోట్లు లీటర్లు పాలు దేశ రాజధాని దిల్లీకి రవాణా చేసినట్లు పేర్కొంది.120 కిసాన్ రైళ్ల ద్వారా యాభై శాతం రాయితో 39,561 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసినట్లు వెల్లడించింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో 183 రైళ్లు నడవగా కొవిడ్ మూలంగా 2020-21లో కొంతకాలం పూర్తిగా స్తంభించాయి.... ఆ తరువాత కరోనా ప్రభావం తగ్గడంతో దశల వారీగా 180 రైళ్లను పునరుద్దరించామని పేర్కొంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది కోసం యాభై కోట్లు నిధులు కేటాయింపు జరిగినట్లు పేర్కొంది.
ఇప్పట్లో కష్టమే...
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎంటీఎస్ రైళ్లు నడపలేకపోతున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. ఇప్పటికే జోన్ పరిధిలో పని చేసే 79వేల మంది ఉద్యోగుల్లో... 12,764 మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇవ్వగా... 1206 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు గజానన్ మాల్యా వెల్లడించారు. కొవిడ్ బారిన పడితే తమ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.