ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల కమిటీ సమావేశంలో చర్చించామని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అన్ని పరీక్షలు వాయిదా వేసే అంశంపైనా చర్చ జరిగిందని వివరించారు. 104 కాల్ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తామన్న మంత్రి.. ఆక్సిజన్ కొరతను అధిగమించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.
ఇవాళ చర్చించిన అంశాలను రేపు ముఖ్యమంత్రికి వివరిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పనిసరైతేనే ప్రజలు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆస్పత్రుల్లో పడకలు, కొవిడ్ కేర్ కేంద్రాల పెంపుపై చర్చించామని మంత్రి తెలిపారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ కొరత వంటి అంశాలపై చర్చించినట్టు వివరించారు. ఔషధాలు, ఆక్సిజన్ కొరత దేశవ్యాప్తంగా ఉందన్న ఆయన.. ఏపీలోనూ ఇబ్బందులు ఉన్నా.. ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ