కరోనా వైరస్ బారినపడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 14 మంది చనిపోగా ఇందులో 13 మంది పురుషులే. వీరిలో 50 ఏళ్లు దాటిన వారు 12 మంది చనిపోయారు. 50- 60 ఏళ్ల మధ్య వయసువారు 8 మంది (57%) ఉండటం గమనార్హం. మృతుల్లో కనిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు, గరిష్ఠం 76 ఏళ్లు. గురువారం సాయంత్రం వరకు ఏపీలో మొత్తం 534 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, వాటిలో మరణించినవారు 2.26 శాతం. కాగా ఏపీలో తొలి మరణం మార్చి 30న నమోదైంది. మృతుల్లో ఇద్దరు వైద్యులున్నారు.
- దీర్ఘవ్యాధిగ్రస్తులే ఎక్కువ
కరోనా మృతుల్లో ఎక్కువ మందికి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. నలుగురు తీవ్ర ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ చనిపోయారు. తర్వాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.
- గుంటూరు, కృష్ణాల్లోనే అత్యధికం
కరోనా మృతుల్లో అత్యధికంగా గుంటూరు, కృష్ణా జిల్లాలవారు నలుగురు చొప్పున ఉన్నారు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి మరణాలు నమోదయ్యాయి.
దిల్లీ నుంచి గల్లీకి..
- గుంటూరు జిల్లాలో చనిపోయిన నలుగురూ దిల్లీ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగినవారే. కృష్ణా జిల్లాలో ఒకరికి దిల్లీ నుంచి వచ్చిన కుమారుడి వల్ల, మరొకరికి పంజాబ్ నుంచి వచ్చిన కుమారుడి వల్ల వ్యాధి సంక్రమించింది.
- విజయవాడకు చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు ఛాతీలో నొప్పితో ఆస్పత్రి చికిత్స పొందుతూ చనిపోయారు. పరీక్షలు నిర్వహించగా ఆమెకు వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. ఆమెకు ఎవరి నుంచి కరోనా వైరస్ సోకిందో ఇంకా తెలియలేదు.
- నెల్లూరు జిల్లాలో చనిపోయిన ఇద్దరు (వీరిలో ఒకరు వైద్యుడు) దిల్లీ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలగడం వల్లే చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
- కర్నూలు జిల్లాలో ఇద్దరు చనిపోగా వారిలో ఒకరు వైద్యుడు. వారిద్దరికీ దిల్లీ నుంచి వచ్చినవారి నుంచే వైరస్ సోకినట్టు భావిస్తున్నారు.
- అనంతపురం జిల్లాలో చనిపోయిన ఇద్దరిలో ఒకరు దిల్లీ నుంచి వచ్చినవారు. అతని నుంచి ఆస్పత్రిలో పక్క బెడ్ మీద అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వ్యక్తికీ వైరస్ సోకింది. ఫలితంగా అతను కూడా చనిపోయారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి - కొత్తగా 9 కేసులు