తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా సోకిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 178 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం కరోనాతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తంగా 148 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారి నుంచి 1,742 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. 2,030 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 3,920కి చేరింది.
గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 143 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్‌లో 10, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 2 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. జగిత్యాల, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 3,472 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా.. మరో 448 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిగా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవీ చూడండి: తిమింగళం చిక్కింది: అనిశా వలలో మున్సిపల్ కమిషనర్