భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిని భరించలేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇంటాబయటా ఎక్కడ ఉన్నా భానుడి తాపానికి తాళలేకపోతున్నారు. జంతువుల పరిస్థితి ఇందుకు మినహాయింపేమి కాదు. హైదరాబాద్‌లోని నెహ్రా జంతుప్రదర్శనశాలలో మూగజీవాల సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రతి ఎన్‌క్లోజర్‌లో కూలర్లు
జంతువులు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు... ప్రతి ఎన్‌క్లోజర్‌లో కూలర్లు ఏర్పాటు చేశారు. వేడిగాలులు లోపలికి వెళ్లకుండా గన్నీ సంచులను ఎన్‌క్లోజర్ చుట్టూ పెట్టారు. రెండు గంటలకొకసారి గన్నీ సంచులను నీటితో తడుపుతూ జంతువులకు చల్లదనాన్ని పంచుతున్నారు. జంతువులు ఉండే ఎన్‌క్లోజర్‌లలో వేడిని నియంత్రించేందుకు వాటిపై భాగంలో తుంగ, గడ్డి వేస్తున్నారు.
ఆహారంలో మార్పులు
వేసవి దృష్టిలో పెట్టుకుని జంతువుల సంరక్షణకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేశారు. అధిక వేడిమి కారణంగా వాటికి అందించే ఆహారం, పానీయాలలోనూ మార్పులు చేశారు. వేసవి తాపం దృష్ట్యా పుచ్చకాయతోపాటు సీ విటమిన్ ఉండే పండ్లను ఆహారంగా ఇస్తున్నారు.
- ఇదీ చదవండి : పొద్దునేమో భానుడి భగభగ... రాత్రిపూట ఉక్కపోత