బోధన నచ్చక 17 రోజుల్లోనే సీటు రద్దు చేసుకున్నా సదరు విద్యార్థికి ఫీజు తిరిగి చెల్లించేందుకు నిరాకరించిన శిక్షణ సంస్థ ఫిట్జీ తీరును హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. సికింద్రాబాద్‌కు చెందిన శీలం శ్రీనివాస్ ఫిర్యాదుపై వినియోగదారుల కమిషన్ తీర్పు వెల్లడించింది.
ఆధునిక బోధన మెళుకువలతో జేఈఈలో ర్యాంకు వచ్చేలా తీర్చిదిద్దుతామని ప్రచారం చేయడం వల్ల 2019లో తన కుమారుడిని ఫిట్జీలో చేర్పించినట్లు పిటిషనర్ శీలం శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యార్థి టాలెంట్ రివార్డు పరీక్ష రాశాక... ఫీజులో 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించిన ఫిట్ జీ.. పినాకిల్ రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ క్లాస్ రూం కోచింగ్ కోసం 4 లక్షల 45వేల రూపాయలు నాలుగు నెలల్లో చెల్లించాలని పేర్కొంది. రెండు నెలల్లో ఫీజు చెల్లించిన తర్వాత... 2019 జూన్ 6న తరగతులు ప్రారంభించారు. అయితే బోధన విధానం, అధ్యాపకులు చెప్పే తీరు విద్యార్థికి నచ్చక పోవడం వల్ల.. సీటు రద్దు చేసి ఫీజు తిరిగి ఇవ్వాలని రెండు వారాల తర్వాత శీలం శ్రీనివాస్ కోరారు. ఫీజు చెల్లించేందుకు ఫిట్ జీ నిరాకరించడంతో ఆయన... హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఫిట్జీ వాదనను తోసిపుచ్చిన కమిషన్..
చదువును వస్తువుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాబట్టి.. పిటిషన్‌ను విచారణకు పరిగణలోకి తీసుకోవద్దని ఫిట్ జీ వాదించింది. తమ విద్యా సంస్థలో చేరాలని ఫోన్ చేసి ఒత్తిడి చేయలేదని పేర్కొంది. విద్యార్థి, ఆయన తండ్రి అన్నీ పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే.. కోర్సులో చేరారని తెలిపింది. ఫీజు చెల్లించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో తిరిగి చెల్లించబోమన్న షరతును అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేశారని ఫిట్ జీ పేర్కొంది. తమ సంస్థ వినియోగదారుల చట్టం పరిధిలోకి రాదన్న ఫిట్ జీ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. విద్యాసంస్థలకు సేవా పన్ను మినహాయింపు ఉందన్న వినియోగదారుల కమిషన్.. బోధన రుసుములో 18 శాతం జీఎస్టీ తీసుకున్నందున ఫిట్జీ.. ఆ పరిధిలోకి రాదని అభిప్రాయపడింది. ఫైనాన్స్ చట్టం ప్రకారం చూసినా.. ఫిట్జీ విద్యా సంస్థల పరిధిలోకి రాదని కమిషన్ పేర్కొంది. ఫీజును తిరిగి చెల్లించడం నుంచి తప్పించుకునేందుకే.. ఫిట్జీ విద్యా సంస్థ ముుసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తోందని కమిషన్ వ్యాఖ్యానించింది.
అది అసమంజస వ్యాపార విధానమే..
ఫీజు తిరిగి ఇవ్వబోమన్న షరతును అంగీకరించారన్న వాదననూ కమిషన్ తిరస్కరించింది. షరతును అంగీకరిస్తారా లేదా అనే ఐచ్ఛికం (option) ఇవ్వలేదని... సంతకం చేస్తారా లేక సీటు వదులుకుంటారా అనే పరిస్థితినే కల్పించారని కమిషన్ పేర్కొంది. రెండేళ్ల ఫీజును ఒకేసారి తీసుకోవడం అసమంజస వ్యాపార విధానమేనంటూ ఫిట్జీని వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. రానున్న సెమిస్టర్ లేదా సంవత్సరానికి ముందే ఫీజు తీసుకోరాదని సుప్రీంకోర్టు, యూజీసీ స్పష్టం చేశాయని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. ఏ నిబంధన ప్రకారం మొత్తం ఫీజు తీసుకున్నారో ఫిట్జీ వివరించలేదని... విద్యార్థి వెళ్లిపోవడంతో ఆ సీటు మిగిలే ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కమిషన్ వివరించింది.
ఇరువైపుల వాదనలు విన్న హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ వక్కంటి నర్సింహారావు, సభ్యులు జవహర్‌బాబు, రాజశ్రీలతో కూడిన బెంచ్ తీర్పు వెల్లడించింది. పరిపాలన ఖర్చుల కింద 10 వేలు మినహాయించుకొని మిగతా 4 లక్షల 35వేల రూపాయలు తిరిగి చెల్లించాలని బెంచ్ ఆదేశించింది. మరో 50 వేల రూపాయలు పరిహారం, కేసు ఖర్చుల కింద 10 వేల రూపాయలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సొమ్మును 45 రోజుల్లో చెల్లించకపోతే.. 9 శాతం వార్షిక వడ్డీతో ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీచూడండి: HIGH COURT: రామప్ప కట్టడం అభివృద్ధి, నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తాం: హైకోర్టు