మార్చిలో లాక్‌డౌన్ మొదలవడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని వేలాది అపార్టుమెంట్లు, ఇతర భవనాల పనులు నిలిచిపోయాయి. ఇవన్నీ మొత్తం 3 నుంచి 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 5 లక్షలమంది కార్మికులు, నిపుణులు పనిచేసేవారు.
కరోనా వేళ నిర్మాణ రంగంపై ప్రభుత్వం ఆంక్షలు వర్తింపచేయడంతో పనులు లేక సుమారు మూడున్నర లక్షలమంది కార్మికులు కాలినడకన, బస్సులు, శ్రామిక రైళ్లలో సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఆంక్షలు సడలించినా వీరెవరూ లేక పనులు ప్రారంభం కాలేదు. ప్రధానంగా మేస్త్రీలు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు లేక నిర్మాణం పూర్తయిన అనేక అపార్టుమెంట్లలోనూ పనులు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. మంత్రి కేటీఆర్ ఆదేశంతో అధికారులు తక్షణం చర్యలు తీసుకుని కూలీలను రప్పించే ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ వచ్చేందుకే ఆసక్తి
బిహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఝార్కండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలు, వృత్తి నిపుణులు హైదరాబాద్ వచ్చి పని చేస్తుంటారు. లాక్‌డౌన్ తరువాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన వేలాది కార్మికులను తిరిగి వెళ్లకుండా అక్కడి బిల్డర్ల సంఘం ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. అక్కడి కూలీ కంటే ఇక్కడ ఇచ్చేది అధికంగా ఉండటం, సౌకర్యాలు బాగుండటంతో తిరిగి హైదరాబాద్ వచ్చేయడానికే కార్మికులు ఆసక్తి చూపిస్తున్నారని నగర నిర్మాణ రంగ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల కార్మికులను తీసుకురావడానికి బస్సుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. పోలీస్, పరిశ్రమల శాఖ అధికారులు సంబంధిత రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ప్రణాళిక రూపొందించారు. కొద్ది రోజులుగా కార్మికుల రాక మొదలైంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వృత్తి నిపుణులు ఇప్పటికే అధికసంఖ్యలో చేరుకున్నారని ట్రెడా ప్రతినిధి చలపతిరావు ‘ఈనాడు’కు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో వివిధ రాష్ట్రాల నుంచి రెండున్నర లక్షలమందిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. కొత్త ప్రాజెక్టులు తక్షణం మొదలు కాకపోయినా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలు/ అపార్టుమెంట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. పనులు చేసే చోట కార్మికులకు కొవిడ్ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.