Constable Exam in Telangana: రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదన్న నిబంధనతో అభ్యర్థులు వేకువజాము నుంచే పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. అభ్యర్థుల్ని గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. చేతులకు మెహిందీ, టాటూలు ఉండకూడదు.. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదన్న నిబంధనలు ఉండటం వల్ల అభ్యర్థుల్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే లోపలికి పంపించారు.
![Constable preliminary written exam started in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16218533_sdcs.jpg)
త్వరలోనే కీ పేపర్: ఈసారి 16,321 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఏకంగా 6,61,198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ్టి 6,03,955 మంది(91.34శాతం) పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష జరిగింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్ ఫోటోలు సేకరించారు. దేహదారుఢ్య పరీక్షలు, తుది పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగానే అనుమతి ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇవాళ్టి పరీక్ష కీ పేపర్‌ను త్వరలోనే వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించారు.
![Constable preliminary written exam started in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16218533_svsv.jpg)
ఆలస్యంతో నిరాశ: పలు పరీక్షా కేంద్రాలకు కొందరు అభ్యర్థులు ఆలస్యంగా చేరుకున్నారు. నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉండటం వల్ల అభ్యర్థులు ఎంత వేడుకున్నా సిబ్బంది మాత్రం లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ పరీక్షాకేంద్రానికి ఒక అభ్యర్థి ఆలస్యంగా రాగా.. అతన్ని లోపలికి అనుమతించలేదు. అలాగే.. హనుమకొండలో ముగ్గురు, కొత్తగూడెంలో ఒకరు, సిద్దిపేటలో ఆరుగురు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒకటి రెండు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. వాళ్లు వచ్చే సమయానికే గేట్లు మూసివేయటంతో ఇందులో ఎవ్వరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. చేసేదేమీ లేక అభ్యర్థులు నిరాశతో పరీక్షాకేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
![Constable preliminary written exam started in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16218533_cvs.jpg)
పరీక్షకు ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించని అధికారులు
కనీస అర్హత మార్కులే లక్ష్యం: కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కుల్ని ఈసారి కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్‌లో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు. ఇక్కడ అర్హత సాధిస్తే తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇదీ గట్టెక్కితే తుది రాతపరీక్ష ఉండనుంది. ఆ పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.
![Constable preliminary written exam started in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16218533_pp.jpg)