హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని మాజీ ఎంపీ రాజయ్య కోరారు. ప్రస్తుతం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ఇది మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న సంఘటనలను ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని రాజయ్య ఆరోపించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న సంఘటనలకు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
'ప్రజాస్వామ్యాన్ని నడిబజార్లో కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకున్నవాళ్లు, అందనివాళ్లు కూడా అల్లరి చేస్తున్నారు. డబ్బులు అందలేదని కొన్ని గ్రామాల్లో మహిళలు ఆందోళన చేస్తుంటే.. సుమోటోగా కేసునమోదు చేయడం లేదు. హుజూరాబాద్ ఎన్నికలను ఎందుకు రద్దుచేయడం లేదు. వెంటనే ఉపఎన్నికలను రద్దుచేసి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది.
- రాజయ్య, మాజీ ఎంపీ
సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయోధ్య రెడ్డి విమర్శించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలుపై మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భాజపా, తెరాస రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ఆరోపించారు.
'వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మంత్రులు వడ్లను కొనమని.. మరికొందరు ప్రతిగింజా కొంటామని వేర్వేరు ప్రకటనలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కించపరిచిన సిద్దిపేట జిల్లా కలెక్టర్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర భాజపా నేతలు చొరవ తీసుకొని.. వడ్లను కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలి. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది.'
- అయోధ్యరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
ఇదీచూడండి: Huzurabad by elections 2021: తెరాస Vs భాజపా... హుజూరాబాద్‌లో ఉద్రిక్తత, తోపులాట