రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. సీనియర్లు, జూనియర్లు అంతా కలిసి పని చేయడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు. ఇటీవల నూతన పీసీసీ కమిటీ దిల్లీ వెళ్లి పార్టీ.. అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను అధిష్ఠానం అంచనా వేసింది. పీసీసీ అధ్యక్షుడికి సీనియర్లకు మధ్య అంతరం ఉందని.. దానిని తక్షణమే పూడ్చకపోతే.. భవిష్యత్తులో అది మరింత పెరిగే అవకాశం ఉందని భావించింది. అంతకు ముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలకు సీనియర్లను కూడా ఆహ్వానించాలని... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌కు లేఖ కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాయకుల మధ్య ఉన్న అంతరాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యల్లో భాగంగా.. పార్టీలో సమతుల్యతను తెచ్చేందుకు కొత్తగా రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసి... అందులో సీనియర్లు అందరికీ స్థానం కల్పించింది.
ముఖ్య నాయకులందరికి కమిటీలో చోటు..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టేందుకు.. సీనియర్లలో అసంతృప్తిని చల్లార్చేందుకు మధ్యేమార్గంగా ఈ నూతన కమిటీ దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో దాదాపు ముఖ్యమైన నాయకులందరికి అధిష్ఠానం స్థానం కల్పించింది. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ ఛైర్మన్‌గా.. మాజీ మంత్రి షబీర్ అలీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతురావు, పొన్నాల లక్ష్మయ్య... సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్‌లతోపాటు... ఏఐసీసీ కార్యదర్శలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు... ఏఐసీసీ ఏర్పాటు చేసిన అన్ని కమిటీ ఛైర్మన్లు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని స్పష్టం చేసింది. తక్షణమే ఈ కమిటీ అమలులోకి వస్తుందని... ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
సీనియర్లలో చల్లారని అసంతృప్తి..
మరో వైపు ఇటీవల నియమించిన పీసీసీ అధికార ప్రతినిధుల విషయంలో... సీనియర్లలో అసంతృప్తి చల్లారలేదు. తమకు తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని... పెదవి విరుస్తున్నారు. నియమించుకునే అధికారం పీసీసీ అధ్యక్షుడికి ఉన్నప్పటికీ.. తమతో చర్చించి ఉంటే బాగుండేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అధికార ప్రతినిధుల నియామకంలో.... సరైన విధానాన్ని పాటించలేదని పేర్కొంటున్న సీనియర్లు.. కొందరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి తాజా రాజకీయ పరిణామాలపై... ఏ మాత్రం అవగాహన లేదని... అలాంటి వాళ్లను ఏవిధంగా అధికార ప్రతినిధులుగా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికార ప్రతినిధుల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునఃపరిశీలన చేసి ప్రతిభ కలిగిన వారికి స్థానం కల్పించాలని కోరుతున్నారు..
ఇవీ చూడండి: Podu controversy: గర్జనపల్లిలో మళ్లీ రాజుకున్న పోడు వివాదం.. పోలీసుల మోహరింపు