Uttam Kumar Reddy on Podu Lands: తెరాస పాలనలో తండాలు ఆగమయ్యాయని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గిరిజన ఆవాసాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. సర్కార్ పోడుభూములను లాక్కుంటూ.. అక్రమ కేసులు పెట్టి గిరిజనులను జైలుకు పంపుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల హక్కులపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాను లంబాడీ భాష కూడా మాట్లాడుతానని.. తన నియోజకవర్గంలో గిరిజన సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రతి తండా, గూడెంనకు సీసీ రోడ్లు వేయించానన్న ఉత్తమ్.. తెరాస పాలనలో తండాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. తెరాస సర్కార్ ఒక్క గిరిజనుడికైనా భూమి పట్టా ఇచ్చిందా అని ప్రశ్నించారు. మునుగోడులో కూడా ప్రజల్లో అవగాహన కోసం సదస్సు పెడితే.. తాను వస్తానని గిరిజన నాయకులకు సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు లేక.. చెట్లకిందనే పాలన నడుస్తుందని ఆరోపించారు. బంజారాహిల్స్‌లో బంజారా భవన్ కడితే సరిపోదని.. గ్రామాల్లో పరిస్థితి గురించి కూడా పట్టించుకోవాలన్నారు. గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలని.. మోదీ, కేసీఆర్‌ను నిలదీయడానికే తానున్నానని ఉత్తమ్ భరోసా ఇచ్చారు.
'తెరాస పాలనలో తండాలు ఆగమయ్యాయి. ఒక్క గిరిజనుడికైనా తెరాస భూమి పట్టా ఇచ్చిందా? పోడు భూములను సర్కారు లాక్కుంటోంది. గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు లేవు. గిరిజన ఆవాసాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో కేసీఆర్ విఫలం. బంజారాహిల్స్‌లో బంజారా భవన్ కట్టిండు మంచిదే. కానీ గ్రామాల్లో పరిస్థితి ఏమిటి? గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలి.'-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ
సమస్యల పరిస్కారం కాంగ్రెస్ పార్టీతోనే.. పోడు భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ వల్లే గిరిజనుల రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్న ఆయన.. సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో లక్షల ఎకరాల భూమి గిరిజనులకు పంపిణీ చేసిందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు, మంగిలాల్ నాయక్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, పార్టీ ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: