రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.25వేల లోపు పంట రుణాలు మాత్రమే మాఫీ చేశారని.. మిగిలిన వాటి పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు పేరుతో రైతుకు అందే ప్రయోజనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ నిలిచి రెండేళ్లయిందని.. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ యాంత్రీకరణ అంటున్నారని ఆక్షేపించారు.
ఉద్యానవన విభాగాన్నినిర్వీర్యం..
ఉద్యానవన విభాగాన్ని కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించలేక 459 మంది ఉద్యానవన అధికారులను తొలగించారని తెలిపారు. ఉద్యానవన విభాగానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోని దక్కన్ షుగర్ లిమిటెడ్‌ను గాలికొదిలేసి.. కేవలం గాయత్రి షుగర్స్‌కు లబ్ది చేకూర్చారని ఆరోపించారు.
30న ఆర్మూర్‌లో దీక్ష..
పంట రుణాలపై వడ్డీ రాయితీని పూర్తిగా ఎత్తేశారన్న జీవన్ రెడ్డి.. రుణమాఫీ, రైతుబంధుపై స్పష్టత లేక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పసుపు బోర్డుపై ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. పసుపు రైతాంగ సమస్యల విషయంలో రైతులకు సంఘీభావంగా ఈ నెల 30న ఆర్మూర్‌లో ఒక రోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు.