రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తి కావస్తున్నా.. ఇప్పటి వరకు పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తారు. ఉద్యమకారులే పాలకులైనా.. ప్రజల పరిస్థితి మారలేదన్నారు. ఆస్పత్రి భవనాలు కడితే సరిపోదు.. ఆస్పత్రుల్లో వైద్యులు, సరిపడా సిబ్బందిని కూడా నియమించాలని ధ్వజమెత్తారు.
కోమటిరెడ్డి ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం దీటుగా జవాబిచ్చారు. యాభై సంవత్సరాల వలస పాలనలో తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల కూడా రాలేదని, తెలంగాణ వచ్చిన వెంటనే ఆరు మెడికల్ కాలేజీలా సాధించామని గుర్తు చేశారు. ఒక బాధ్యతతో తెలంగాణ సాధించామని.. అదే బాధ్యతతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడుకుంటారని మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే.. ఐదువేల సిబ్బందిని నియమించుకున్నట్టు.. కరోనా వల్ల వైద్య సిబ్బంది అంతా కరోనా సేవల్లో ఉన్నట్టు మంత్రి తెలిపారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మరో ఆరువేల మంది వైద్య సిబ్బందిని నియమించుకోనున్నట్టు మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: రఫేల్ జెట్ల విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు