వరదలతో సతమతమవుతున్న ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ వైఫల్యాన్ని నిరసిస్తూ... కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను... ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు తోపులాట జరగడం వల్ల కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. కార్యాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడం వల్ల... కాంగ్రెస్ నాయకులు గేటు ముందే బైఠాయించారు. కాసేపటి తర్వాత మీడియాను పోలీసులు అనుమతించగా... కాంగ్రెస్ నాయకులు కమిషనర్ లోకేశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్‌లో రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్... ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారో దుర్భిని వేసి చూసినా కనిపించడం లేదని హస్తం నాయకులు విమర్శించారు. తెరాస ప్రభుత్వం మాయమాటలతో కాలం గడుపుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా చేస్తామని... చివరికి శ్మశానం చేశారన్నారు. మూడు రోజులుగా వరద నీటిలో మగ్గుతున్న వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.