గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నాయకులు తగిన సహకారం అందించలేదని ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. అందుకే ఓటమిపాలయ్యానని చెప్పుకొచ్చారు. వెంటనే జోక్యం చేసుకున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి... గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి మాత్రమే మాట్లాడాలని సూచించారు.
మాటల యుద్దం...
అయినా అది వినకుండానే తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడకుంటే ఎలా తెలుస్తుందని... పీసీసీని ప్రశ్నించారు. ఇదే సమయంలో.... సమావేశంలో పాల్గొన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి టి.నిరంజన్ జోక్యం చేసుకుని దాసోజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దాసోజు శ్రవణ్, నిరంజన్‌ల మధ్య మాటామాట పెరిగి సవాల్ విసురుకునే వరకు చేరింది. పార్టీలోకి కొత్తగా వచ్చావని... తాను 43 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని... దాసోజుపై నిరంజన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. కాసేపు అక్కడ ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువైపులా సర్దిచెప్పేందుకు కొందరు నాయకులు విఫల యత్నం చేశారు. ఫలితం లేకపోవటం వల్ల పీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుని సర్దిచెప్పగా గొడవ సద్దుమణిగింది. ఈ గొడవ కారణంగా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసిన లక్ష్యం కాస్త నీరుగారిపోయింది.