బల్దియా ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీలను ఎదుర్కోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మాటల తూటాలు పేలుస్తూ.. అధికార తెరాస, భాజపాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే పది మంది ప్రచార తారలను రంగంలోకి దించుతోంది. వీళ్ల ద్వారా.. కాంగ్రెస్ హయాంలో జరిగిన.. నగరానికి కృష్ణా నీటి తరలింపు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, మెట్రో, ఓఆర్ఆర్ వంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.
హామీలివ్వం..
మరోవైపు తెరాస వైఫల్యాలు, భాజపా ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తిచూపడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో లేనందున ఎలాంటి హామీలు ఇవ్వరాదని, మేనిఫెస్టో కమిటీలో నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నేత తెలిపారు. ఇటీవల వరదల సమయంలో భాగ్యనగర ప్రజలు పడిన ఇబ్బందులు.. ప్రభుత్వం స్పందించిన తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. నగరాభివృద్ధి కోసం గట్టిగా ప్రశ్నించే వారు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కోరనున్నారు.
కుటుంబ సభ్యుల ప్రచారం
వ్యూహాత్మక ప్రచారం నిర్వహించేందుకు వీలుగా.. అభ్యర్థులతోపాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరోవైపు కాంగ్రెస్ గెలుపునకు అవకాశం ఉన్న డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించి సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ప్రత్యేక కమిటీలతోపాటు, సమన్వయకర్తలను నియమించిన పీసీసీ.. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సమన్వయకర్తలను నియమిస్తోంది. డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించేందుకు అవసమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకునే పనిలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు.
10 మంది ప్రచార తారలు
గ్రేటర్ ఎన్నికల్లో నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు పది మంది ప్రచార తారలను పీసీసీ నియమించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, జెట్టి కుసుమ కుమార్‌లతోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గ్రేటర్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్‌లు ఉన్నారు.
సత్తా ఉన్న వాళ్లకే అవకాశం..
అధికార తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీల వైఫల్యాలు, లోపాలు ఎండగడుతూ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధని గుర్తుచేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే సత్తా ఉన్న నాయకులకు ప్రచార తారలుగా అవకాశం కల్పించినట్లు పీసీసీ వెల్లడించింది.