హైదరాబాద్ నాంపల్లి రెడ్‌హిల్స్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శిక్షణ సంస్థలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమగ్ర ఉద్యానాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యాన, పరిశ్రమ శాఖ సంచాలకుడు లోక వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిన దృష్ట్యా అవకాశాలు, అవగాహన, మొక్కల లభ్యత, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై చర్చించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయిల్‌పాం సహా కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ తోటల సాగులో తీసుకురావాల్సిన గుణాత్మక మార్పులు, ఉద్యాన వన శాఖ సుశిక్షితం, బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించారు.
పండ్ల పంటల సాగుకు సంబంధించి మామిడి 52 శాతం ఆక్రమించగా.. మిగతా 30 శాతం బత్తాయి సాగులో ఉంది. కేవలం 20 శాతం విస్తీర్ణంలో మాత్రమే బొప్పాయి, దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్, జామ, ద్రాక్ష వంటి తోటలు సాగవుతున్న తరుణంలో ఇతర పండ్ల సాగు అవకాశాలు, మార్కెటింగ్, విదేశీ ఎగుమతులు, ఆహారోత్పత్తల తయారీ పరిశ్రమల స్థాపన, అదనపు విలువ జోడింపు, నిల్వ, ప్యాకింగ్, బ్రాండింగ్ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
పర్యావరణహితంగా ఎకరం విస్తీర్ణం ఆయిల్‌పాం తోటలో అంతర పంటలు రైతుకు ఇష్టమైనవి ఏమైనా కూరగాయలు లేదా ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు.. తద్వారా ఆదాయం పొందవచ్చని వెంకటరామిరెడ్డి తెలిపారు. నాలుగైదేళ్ల నుంచి పామాయిల్ పంట చేతికొస్తుంది. క్షేత్రంలో మొక్కలు వేసుకునేటప్పుడే హద్దులు, గట్లపై కొత్తగా బోర్డర్ క్రాప్ కింద టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం సాగు ప్రోత్సహించబోతున్నామని వెల్లడించారు. ఇది 15 ఏళ్ల తర్వాత లభించనున్న రూ.కోటి నుంచి కోటి 25 లక్షల రూపాయల ఆదాయానికి అదనం అని పేర్కొన్నారు.