Bribe: ప్రజలకు సంబంధించిన ఏ పనులు కావాలన్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లా చాపాడు మండల తహసీల్దార్ తన భర్తతో కలసి వసూళ్లకు పాల్పడుతున్నారని మైదుకూరుకు చెందిన చొక్కం ఆంజనేయులు శుక్రవారం.. ఆర్డీవో వెంకటరమణకు ఫిర్యాదుచేశారు. తహసీల్దార్ భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ.. తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ గదిలో కూర్చుని రికార్డులు పరిశీలిస్తున్న చిత్రాలను వినతిపత్రానికి జోడించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటరును మధ్యవర్తిగా ఉంచుకుని పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని బాధితుడు ఆంజనేయులు పేర్కొన్నారు. చాపాడు మండలంలో అత్యధికంగా చుక్కల భూములున్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో సవరించేందుకు రూ.లక్షల్లో వసూలు చేశారని ఆరోపించారు. మ్యుటేషన్‌కు రైతుల నుంచి రూ.5-10 వేలు, ఇంటి పట్టా అనుబంధ పత్రం కోసం రూ.2-5 వేలు తీసుకుంటున్నారని, పల్లవోలు రెవెన్యూలో ల్యాండ్ కన్వర్షన్, లేఅవుట్ల కోసం కాల్వలు, చుక్కల భూమి అనుమతి మంజూరుకు రూ.లక్షల్లో అవినీతికి పాల్పడినట్లు చెప్పారు. తహసీల్దారు జ్యోతి రత్నకుమారి మాట్లాడుతూ.. తనపై చేసినవి నిరాధార ఆరోపణలన్నారు. తన భర్త ఎప్పుడో ఒకసారి కార్యాలయానికి వస్తారని, కంప్యూటరు గదిలో కూర్చుని ఉంటే ఉండొచ్చని చెప్పారు.
ఇవీ చదవండి: CM KCR National Tour: హస్తినలో సీఎం కేసీఆర్.. జాతీయస్థాయి పర్యటన షురూ..